చివరి ఓవర్ థ్రిల్లర్.. చెన్నైపై సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం!

  • చెన్నైపై సన్‌రైజర్స్ విజయం
  • అర్ధ శతకాలతో చెలరేగిన అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్
  • చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, ఓవర్టన్ మూడేసి వికెట్లు
  • మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన ఎషాన్ మలింగ
  • 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ
  • ఆఖరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రఫుల్ హింగే
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఉత్కంఠతో ఊగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం నమోదు చేసింది. దాదాపు ఓటమి ఖాయం అనుకన్న స్థితి నుంచి సన్ రైజర్స్ గట్టెక్కిన తీరు అదరహో అనాల్సిందే. 195 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

చివరి ఓవర్లో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని ప్రఫుల్ హింగేకు అప్పగించాడు. అప్పటికే మూడు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకుని అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచిన హింగేపై ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. తొలి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి లెగ్ బై రూపంలో ఒక పరుగు వచ్చాయి. మూడో బంతిని హింగే నడుము కంటే ఎత్తులో వేయడంతో అంపైర్ నో-బాల్‌గా ప్రకటించాడు. దీంతో సమీకరణం 4 బంతుల్లో 14 పరుగులుగా మారింది. 

అయితే, ఫ్రీ-హిట్‌ను అన్షుల్ కంబోజ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన జామీ ఓవర్టన్ (16) లాంగ్-ఆఫ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. చివరి రెండు బంతులకు రెండు సింగిల్స్ మాత్రమే రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ట్రావిస్ హెడ్‌తో (23) కలిసి తొలి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలో 75 పరుగులు జోడించి బలమైన పునాది వేశాడు. అయితే, ముఖేష్ చౌదరి ఒకే ఓవర్లో హెడ్, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ పంపి చెన్నైకి ఊరటనిచ్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా, క్లాసెన్ తన క్లాస్ ఆటతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జామీ ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీయగా, ముఖేష్ చౌదరి రెండు వికెట్లు పడగొట్టాడు.

195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఆయుష్ మాత్రే (13 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. మాథ్యూ షార్ట్ (34), సర్ఫరాజ్ ఖాన్ (25), శివమ్ దూబే (21) తమ వంతు పోరాటం చేశారు. అయితే, సన్‌రైజర్స్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా, ఎషాన్ మలింగ (3/29) తన అద్భుత బౌలింగ్‌తో చెన్నై మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. చివరి వరకు పోరాడినప్పటికీ, లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచి చెన్నై ఓటమిని అంగకరించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మరింత ముందుకు దూసుకెళ్లింది.



Sunrisers Hyderabad
SRH vs CSK
Chennai Super Kings
IPL 2024
Abhishek Sharma
Heinrich Klaasen
Ishan Kishan
Indian Premier League
T20 Cricket
Rajiv Gandhi International Stadium

More Telugu News